Thursday, November 24, 2016

ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి కొండ గుహ


నల్లమల అడవులు భారత దేశ అడవులలో ప్రధానమైనది. అడవులు తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్ నగర్నల్గొండ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూలుకడప, ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలలో విస్తరించి ఉన్నది. అడవులు కృష్ణా, పెన్నా నదుల మధ్యలో ఉత్తర మరియు దక్షిణ దిక్కులో విస్తరించి ఉంది.

మీలో చాలా మంది కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన అహోబిలం చూసి ఉంటారు అవునా..! అదికూడా ఒక్క రోజులోనే ఏదో వీకెండ్ లో అలా వెళ్ళి వస్తుంటారు. ఒక వేళ ఫ్యామిలీ తో గాని, చుట్టుపక్కల కుటుంబాల తో గాని ట్రిప్ వేసుకొని వస్తే అహోబిలం, మహానంది చూస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఆధ్యాత్మిక పర్యటన చేసినట్లుంటుందని శ్రీశైలం - మహానంది - అహోబిలం రెండురోజులకో లేక మూడు రోజులకో ప్లాన్ చేసుకొని వస్తుంటారు.

ఇక్కడ మనం మాట్లాడేది అహోబిలం కనుక, అహోబిలం లో మీరు ఏమి చూశారు లేదా చూస్తారు అంటే .. మీరు ఠక్కున చెప్పే సమాధానం ముందుగా ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం. ఇంతేనా ..! ఒకవేళ మీరు బాగా అహోబిలం 10 సార్లు చూసినవారైతే వీటితో పాటు నవ నరసింహ గుళ్ళు, ప్రహ్లాద బడి (కొండపై నుండి నీళ్ళు పడుతూ చాలా ఆహ్లాదంగా ఉండే గుహ), మఠం, ఉగ్ర నరసింహుడు చీల్చుకువచ్చిన స్తంభం ఇలా ఏవేవో చెబుతారు .

ఆల్ మోస్ట్ అహోబిలం వచ్చే పర్యాటకులు ఇవే చూస్తారు అనుకోండి ..! కానీ ఇక్కడ మీకు చాలా వరకు తెలియని, కొద్ది పాటి భక్తులకు మాత్రమే(స్థానిక ప్రజలకు) తెలిసిన ఒక ఆలయం ఉంది. వాళ్ళు కూడా కేవలం కార్తీక మాసంలోనే ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఆలయాన్ని చేరుకోవాలంటే గొప్ప సాహసమే చేయాలి మరి ...! ఆది కూడా వర్షాకాలం ఏమాత్రం వెళ్ళకూడదు. వెళ్ళారా ఇక అంతే సంగతులు.. సెల్ ఫోన్ లు పనిచేయవు, రాత్రి పూట బిక్కు బిక్కు మంటూ ఉండటం, తిండి ఉండదు కనీసం తాగటానికి మినరల్ వాటర్ బాటిల్ కూడా దొరకదు. ఎక్కడ పులులు, సింహాలు వచ్చి మీద పడతాయని భయం.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో ఉన్న అహోబిలంలో వెలసిన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి ముందు మూడు కిలోమీటర్ల దూరంలో ఎడమ పక్కన ఒక కొండ దారి ఉంది.

కొండ దారి గుండా వెళితే మీరు నల్లమల అడవులలోకి ప్రవేశిస్తారు. నల్లమల అడవులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్య అటవీ సంపద చేకూర్చే అడవులు. మీరు వెళుతున్న మార్గంలో పెద్ద పెద్ద ఎత్తైన కొండలు, ఎక్కడ కిందపడిపోతామో అనే విధంగా అనిపించే లోయలు, చిన్న చిన్న పిల్ల కాలువలు, వాటి నుండి వేరు పడిన సెలయెర్లు, శబ్ధం చేసుకుంటూ ఎత్తు నుండి జాలు వారే జలపాతాల నడుమ ఒక గుహ ఉంది.

లింగమయ్య
నల్లమల అడవిలో ఉన్న ఉల్లెడ ఉమామహేశ్వర స్వామి గుహని వజ్రాల కొండ గుహ అని పిలుస్తారు. వజ్రాల కొండ గుహాల్లో మూడు గుహలు ఉన్నాయి. అవి వరుసగా ఉల్లెడ నరసింహ స్వామి గుహ, ఆశ్వథ్దామ గుహ, ఉల్లెడ ఉమామహేశ్వ స్వామి గుహ .కొండ గుహలో కొన్ని వందల ఏళ్ల క్రితమే ఉల్లెడ ఉమామహేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈయన ఇక్కడ లింగమయ్య స్వామి రూపంలో భక్తులచే పూజలు అందుకుంటున్నాడు.

గుహ వైపు వెళ్లే దారి
ఇక్కడున్న లింగమయ్య స్వామిని దర్శించుకోవడమంటే, ఎక్కడో భారత దేశ సరిహద్దులో ఉన్న అమర్నాథ్ క్షేత్రం లో గుహలో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకోవడమే అని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం.

దట్టమైన అడవిలో అప్పుడే విచ్చుకున్నట్లుండే పూల సువాసన నడుమ, పక్షుల కిల కిల రాగాల నడుమ, పింఛం విప్పి నాట్యం చేస్తున్న నెమాళ్ల నడుమ, కళ్ళతో ఎప్పుడూ చూడని అందాలాన్ని ఒకే చోట చూస్తూ ... కనువిందు చేసే ప్రాంతాన్ని చూసి ఈర్శ కలగాల్సిందే ఎవ్వరికైనా ఉల్లెడ మహేశ్వర స్వామి గుహలో ఒక శివలింగం, మూడు పడగల నాగపాము, శంకు మరియు వీణ స్వయంభూ గా వెలిశాయి. ఈ గుహలో ఉన్న శివలింగం పై నిత్యం ధారాళంగా అదికూడా మంచు నీరు పడుతుంది. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పార్వతమ్మ తీర్థం నుండి ఐదు తలల నాగపాము వచ్చి, శివలింగాన్ని చుట్టుకొని అభిషేకం చేస్తుంది.

పార్వతమ్మ తీర్థం
ఉమా మహేశ్వర స్వామి కొండ లో ప్రధానమైనది పార్వతమ్మ తీర్థం. పార్వతమ్మ తీర్థం కి ఉన్న మహత్యం ఏమిటంటే పుణ్య తీర్థంలో స్నానాలు చేసినట్లయితే సర్వాపాపాలు పోయి, పుణ్యం వరిస్తుంది. అలాగే కన్య లకు మంచి భర్త, పిల్లలు లేని వారికి పిల్లలు, వైకుంఠ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి, సకల భోగభాగ్యాలు సిద్డిస్తాయి.

ఉల్లెడ ఉమామహేశ్వ స్వామి దెవస్థానం కొలువుదీరిన కొండ గుహ కు అనుకుని, కొండపై భాగం నుంచి పార్వమ్మ తల్లి స్వామి పాదాలను తాకేలా వందల అడుగుల ఎత్తులో శివుడి జటాజుటం నుండి .. ఉరకలేస్తూ... దూకుతున్న దృశ్యం మహాద్భుతం. పున్నమి రోజుల్లో చంద్రుడు విరజిమ్మే వెన్నెల కాంతి పెరుగుతున్న కొద్దీ జలపాతం ధార కూడా ఉధృతంగా పెరుగుతూ ఉంటుందని ఇక్కడికి వచ్చే యాత్రికులు చెబుతారు

పున్నమి వెన్నెల ప్రకశించే వేళ, .. అద్భుత జలపాతాల నుంచి వచ్చిన ఔషధగుణాలున్న నీటితో ఏర్పడ్డ గుండంలో పున్నమి నాడు రాత్రి వేళ చంద్రకాంతి విరజిమ్ముతున్న సమయంలో స్నానమా ఆచరిస్తే ... వ్యాధులు ఏవీ దగ్గరికిరావని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇలా స్నానమాచరించి లింగమయ్యని దర్శించుకుంటే తాము కోరుకున్న కోర్కెలు తీరటంతో పాటు పాపాలు కూడా తొలిగిపోతాయన్న నమ్మకం ఇక్కడికి వచ్చే భక్తులలో ఉంది.

ఉల్లెడ మహేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే వారు పర్యాటకులైతేనేమి, భక్తులైతేనేమి గాని, వర్షాకాలంలో వెళ్ళకూడదు ఎందుకంటే .. వర్షాకాలంలో అడవి అంతా అల్లకల్లోలంగా ఉంటుంది భీకర పిడుగుల శబ్ధాలు, భయంకరమైన గాలులు, తీవ్రమైన వర్షం తో వాతావరణం అంతగా అనుకూలంగా ఉండదు అంటే దీనర్థం అడవిలో క్షణ క్షణం వాతావరణం మారుతూ ఉంటుంది. వర్షం కురిస్తే అడవి నుండి బయటకి రావడం చాలా చాలా కష్టం.